పుణ్యకోటి వాహనంపై పరంధాముడు
నక్కపల్లి : ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి కొండదిగువన స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారిని నిత్యపూజలు అర్చనలు నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరుప్పావై 16వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను ఉంచి తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు కానుకలు, పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.కొత్తసంవత్సరం సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది.
ముక్కోటి ఏకాదశి అనంతరం ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రిపూట కూడా స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తారు.


