బీ1 కోచ్ లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి
యలమంచిలి రూరల్ : యలమంచిలి రైల్వేస్టేషన్ వద్ద టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసేందుకు దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి నిర్వహిస్తున్న విచారణ గురువారం రెండోరోజూ కొనసాగింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులో బీ1, ఎం2 బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన సంగతి విదితమే. రైలు యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై ఆగినపుడు మంటలు వ్యాపించడంతో 157 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై ఉలిక్కిపడ్డ రైల్వేశాఖ ప్రమాదానికి మూల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో శోధిస్తోంది. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీటీసీ)లో బుధ, గురువారాల్లో సేఫ్టీ కమిషనర్ చేస్తున్న విచారణలో ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా యలమంచిలి, నర్శింగబిల్లి రైల్వేస్టేషన్లలో ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని విజయవాడకు పిలిపించారు. అందుబాటులో ఉన్న కొందరు ప్రయాణికులను కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. రైలు బీ1 బోగీలో లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్టు ఇప్పటికే అధికారులు నిర్థారణకు వచ్చారు. అక్కడ్నుంచి ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడంలేదు. మానవ తప్పిదమా? సాంకేతిక కారణం వల్ల ప్రమాదం సంభవించిందా అన్నది తేల్చేందుకు ఎం1 బోగీలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు పూర్తయితే ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లలో సగటున ఏడాదికి 8 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్రేక్ బైండింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపాలతో రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే రైల్వేశాఖ నిపుణులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ప్యానెల్ బోర్డులు సురక్షితంగా ఉన్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులేవైనా రైలులో ఉన్నాయా?లేక ధూమపానం కారణంగా మంటలు చెలరేగాయా?అన్నది తెలియాల్సి ఉంది.


