పరుగులే..
పట్టించుకోకపోయినా
కార్గోలోనూ పురోగతి
విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు.
2025లో గణనీయమైన ప్రగతి
2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
2025 జనవరి నుంచి
నవంబర్ వరకు ఎయిర్‌పోర్టు ఘనతలివీ..
● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు
● 2025 జనవరి, నవంబర్‌లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేశారు.
● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్‌ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్‌పోర్టు నిలవడంగమనార్హం.
అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం?
అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్‌పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్‌పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్‌లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్‌లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది.
2025లో విశాఖ ఎయిర్‌పోర్ట్ జోరు
రాజకీయ సవాళ్ల నడుమ
9 శాతం వృద్ధి
విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం
కార్గోలోనూ రికార్డులు
వైజాగ్ ఎయిర్‌పోర్టు కార్గో టెర్మినల్‌లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది.
పరుగులే..


