
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
నర్సీపట్నం: అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దని, ఒకవేళ అలా చేస్తే సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహన్‌రావు హెచ్చరించారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో ఎరువుల డీలర్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఏపీ బస్తా 50 కిలోలు రూ.1350, 28–28–0 రూ.1800 ఉంటుందన్నారు. కాంప్లెక్స్ ఎరువుల వాడకం పెంచాలన్నారు. డీలర్లు యూరియా అధిక ధరలకు అమ్మినా, ఉండి లేదని చెప్పినా వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 8331056471 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. నర్సీపట్నం మండలంలో యూరియా 165 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 250 టన్నులు డీలర్ల వద్ద ఉన్నాయన్నారు. 36 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. వరి ఉడుపుల వరకు ఎంత అవసరమో అంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. వరినాట్లు వేసేటప్పుడు ఆఖరి దమ్ములో 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 20 కిలోల పొటాష్ వేసుకోవాలన్నారు. యూరియా మీద అధారపడటమే కాకుండా డీఏపీ కానీ, 28–28–0 వాడుకోవాలన్నారు. ఉడిచిన 15 నుంచి 20 రోజుల్లో నానో యూరియా పిచికారీ చేయాలన్నారు.