
ఖరీఫ్ సాగు లక్ష్యం 56వేల హెక్టార్లు
నాతవరం: జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో 56వేల హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహనరావు తెలిపారు. మండలంలో తాండవ జంక్షన్, గుమ్మడిగొండ, నాతవరం గ్రామాల్లో గల ఎరువుల దుకాణాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుమ్మడిగొండలో రైతులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 40వేల హెక్టార్లలో వరి నాట్లు వేసినట్టు చెప్పారు. వచ్చేనెల మొదటి వారం నాటికి లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. బోర్లు ఉన్న ప్రాంతాల్లో వర్షాలకు ముందే 10వేల హెక్టార్లలో రైతులు వరినాట్లు వేశారన్నారు. ఈఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల జులైలో వేయాల్సిన వరి నాట్లు ప్రస్తుతం చురుగ్గా వేస్తున్నారన్నారు. ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. ఈఏడాది కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అధికంగా ఉండడంతో రైతులు వాటి బదులు యూరియా వేస్తున్నట్టు తెలిపారు. దమ్ము సమయంలో యూరియా వేయరాదని, రైతులకు అవగాహన లేకనే వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఏడు వేల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నాతవరం మండలంలో అన్ని రకాల ఎరువులు 411 టన్నులు ఉండగా వాటిలో 100 టన్నులు యూరియా సిద్ధంగా ఉందన్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు 350 టన్నుల యూరియా వస్తుందని, దాంట్లో 70 టన్నులు నాతవరానికే కేటాయించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌బీకేలతో పాటు పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నట్టు చెప్పారు. నాతవరం మండలంలో పీకే గూడెం పీఏసీఎస్ ద్వారా మాత్రమే ఎరువులు సరఫరా చేస్తున్నామని, మిగతా రెండు పీఏసీఎస్‌లకు ఈ పాస్ యంత్రాలు లేకపోవడంతో వాటికి ఎరువులు సరఫరా చేయలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నానో యూరియా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. ఆయన వెంట పాయకరాపేట ఏడీ ఉమాప్రసాద్, నాతవరం వ్యవసాయాఽధికారి సుగుణ సిబ్బంది ఉన్నారు.