
అర్ధరాత్రి యువకుల వీరంగం
యలమంచిలి రూరల్: డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం వద్ద ముగ్గురు యువకుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానై ఓ కుటుంబంపై దాడికి దారి తీసింది. తమ్ముడిపై కక్షతో 12 మంది యువకుల బృందం అన్న ఇంటికి వెళ్లి మూకుమ్మడిగా దాడికి పాల్పడింది. దాంతో వెలుగు వీవోఏ మెంట్రెడ్డి గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు మహిళలకు కౌకు దెబ్బలు తగలాయి. గాయపడిన వీవోఏ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడికి పాల్పడిన యువకుల హల్‌చల్‌తో మండలంలోని షేకిళ్లపాలెంలో గురువారం అర్ధరాత్రి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాధిత కుంటుంబీకులు, యలమంచిలి రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాలివి.. యలమంచిలి, కశింకోట మండలాల సరిహద్దు గ్రామాలైన చిన షేకిళ్లపాలెం, అచ్చుతపురం గ్రామాల్లో గురువారం గ్రామదేవత నల్లమారమ్మ పండగ జరిగింది. ఈ జాతరలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టేజీ ప్రోగ్రాం వద్ద చిన షేకిళ్లపాలెం గ్రామానికి చెందిన మెంట్రెడ్డి చంటికి మరో ఇద్దరు పెద షేకిళ్లపాలెంకు చెందిన మరిశా శంకర్, మరికొంత మంది యువకులకు మధ్య వివాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న చంటి అన్నయ్య మెంట్రెడ్డి గోవింద్, అతని భార్య వేణు అక్కడకు వెళ్లారు. చంటిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పెద షేకిళ్లపాలెంకు చెందిన భీముని అశ్విన్, మరో 11 మంది యువకులు రాత్రి 11.30 గంటల సమయంలో మెంట్రెడ్డి చంటిపై దాడి చేయడానికి చిన షేకిళ్లపాలెంలో అతని ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి చంటి దొరక్కపోవడంతో మెంట్రెడ్డి గోవింద్, అతని భార్య వేణులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గోవింద్ తలకు బలమైన గాయంతో తీవ్ర రక్తస్రావం కావడంతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా, అక్కడ్నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా, కుటుంబీకులు గోవింద్‌ను అనకాపల్లి బెనర్జీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన యువకుల్లో కొంతమంది వద్ద చాకు, కత్తి వంటి మారణాయుధాలు, కర్రలు ఉన్నాయని బాధిత కుంటుంబీకులు సాక్షికి తెలిపారు. ఈ దాడిలో గోవింద్ భార్య వేణు, మరిశా లక్ష్మిలకు కౌకు దెబ్బలు తగిలాయి. లక్ష్మి మెడలో బంగారు గొలుసును యువకులు తెంచేశారు. తెగిపోయిన గొలుసు ముక్కను పోలీసులకు చూపించారు. దీనిపై గోవింద్ తల్లి వరహాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద షేకిళ్లపాలెంకు చెందిన భీముని అరుణ్, బండారు వాసు, శానాపతి శ్రీను, చందక రవి, ప్రగడ ఆనంద్, గందూరి వాసు, భీముని అశ్విన్, బండారు నవీన్, భీముని నూకరాజు, ఎలిశెట్టి గంగాధర్, పూడి అప్పలనాయుడు, భీముని చిరంజీవి లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం ఉపేంద్ర తెలిపారు.