
ఉప్పుగల్లీల భూములపై పరిశ్రమల పడగ
వాటిని ఏపీఐఐసీకి బదలాయించాలని ప్రభుత్వం నోటీసులు
ససేమిరా అంటున్న పంచాయతీ
బదలాయిస్తే పూడిమడకకు ముప్పు
ఇప్పటికే ఉప్పుటేరు కలుషితం
అచ్యుతాపురం: గంగ పుత్రులకు కొత్త కష్టమొచ్చింది. వేటకు వెళ్లినా గతంలో వలే మత్స్య సంపద దొరకక, వేట కోసం సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే మత్స్యకార కుటుంబీకులకు మరో వనరుగా ఉప్పు గల్లీలు ఉండేవి. నాలుగు శివారు గ్రామాలుండే పూడిమడకకు ఒక వైపు పూర్తిగా సముద్రం, రెండు వైపులా ఉప్పుగల్లీలు, ఉప్పుటేరు ఉన్నాయి. అచ్యుతాపురం సెజ్ కేంద్రంగా ఇప్పటికే భూములు సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పూడిమడకకు ఆనుకొని ఉన్న ఉప్పుగల్లీలుగా ఉపయోగించే భూముల్ని బదలాయింపు చేసి ఏపీఐఐసీకి అప్పగించే పనికి ఉపక్రమించడంతో పూడిమడక ఉనికికే తీవ్ర ప్రమాదం ఏర్పడింది. అలాగని వేలాది మంది గల పూడిమడకను తరలించే అవకాశాలు కూడా క్లిష్టమే. ఇప్పటికే ఉపాధి దెబ్బతిని ఇక్కడ ఉండలేక, మరో చోటకి వెళ్ల లేక మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయం మరింత శరాఘాతం కానుంది.
పూడిమడక ఉనికికే ప్రమాదం..?
పూడిమడక గ్రామం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అతి పెద్ద జాలరి పల్లి. వేలాది మంది మత్స్యకారులు ఉండే ఈ గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది. నాలుగు ప్రధాన శివారు గ్రామాలుగా ఉన్న పూడిమడకలో ఉండే లైట్ హౌస్ ద్వారా మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు దిక్కులు తెలిపే సూచనలు ఉన్నాయి. సంప్రదాయ బద్ధంగా మత్స్యకారులు ఉన్న ఈ గ్రామంలో ఉప్పు పంట సైతం ప్రధాన వృత్తిగా ఉంటూ స్థానికులకు ఉపాధినిచ్చేది. సముద్రపు ఆటు పోటులు, ఉప్పుటేరు ద్వారా నీటి రాకపోకలతో ఎంతో ప్రశాంతంగా ఉండే పూడిమడకకు అచ్యుతాపురం సెజ్ వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. కొంత మంది వేటను వదిలి సమీప కంపెనీల్లో కూలీలుగా మారారు. కంపెనీలతో పాటు బ్రాండిక్స్ పైప్‌లైన్‌ల వల్ల సముద్రం కలుషితమై మత్స్య సంపద తగ్గిపోయింది. ఉప్పుటేరులోకి రసాయనాలు రావడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీనికితోడు ఫిషింగ్ హార్బర్ కోసం చేపట్టిన అస్తవ్యస్త పనులు ఉప్పుటేరు రూపురేఖల్ని మార్చేశాయి. కుచించుకుపోయిన ఉప్పుటేరు చూసి తల్లడిల్లుతున్న గ్రామస్తులకు వరదనీటి ముప్పు (సముద్రంలో నీరు పెరిగినప్పుడు ఉప్పుటేరు ద్వారా వచ్చే వరద) నుంచి రక్షణగా ఉండే ఉప్పు గల్లీల భూములనూ పరిశ్రమల కోసం బదలాయించాలని భావిస్తుండడం కొత్త ప్రమాదం తెచ్చిపెడుతోంది.
166.15 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పుగల్లీలుగా పిలవబడే గయాలు, ఉప్పు పర్ర భూముల్ని ఏపీఐఐసీకి బదలాయించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూలై 9వ తేదీన అచ్యుతాపురం తహసీల్దార్ పేరుతో వచ్చిన నోటీసుల సారాంశం మేరకు పంచాయతీ ఆమోదం తెలిపి సదరు భూముల బదలాయింపు సమాచారం ప్రజలకు తెలపాలని సూచించింది. దీనిపై ఆగస్టు మొదటి వారంలో పంచాయతీ సమావేశం భూముల బదలాయింపు వద్దని నిర్ణయించింది.
ఉప్పు గల్లీలకు, ఊరుకీ ముప్పే...
1955లో ఈ ప్రాంతంలో ఉప్పు తయారీ ప్రారంభించారు. వందలాది మంది మత్స్యకార మహిళలు ఉప్పు గల్లీలో పనిచేసేవారు. 2003 సంవత్సరంలో లీజుకి తీసుకున్న వారు లీజు చెల్లించడం ఆపివేయడంతో ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో లీజులను నిలిపివేయడంతో ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఆ సమయంలో మహిళలు కొందరు పలు గ్రామాల్లో ఉప్పుని విక్రయించేవారు. ప్రస్తుతం కొందరు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కొద్దిపాటి ఉప్పు తయారీ చేపడుతున్నట్టు సమాచారం. 2015 నుంచి ఉప్పు గల్లీలలో కార్యకలాపాలు నిలిచిపోవడం, తర్వాత సెజ్ పరిశ్రమలు రావడంతో ఈ భూమి ద్వారా వరద నీరు వర్షాకాల సమయంలో మళ్లించి ఉప ద్రవాలను తప్పించేందుకు దోహపడుతుంది. సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉన్న మొగ నుంచి వచ్చే నీరు ఉప్పుటేరు మీదుగా ఉప్పుగల్లీ ప్రాంతాల మీదుగా అవసరమైనప్పుడు రెండవ ప్రాంతం వైపు గల గట్టుని తాత్కాలికంగా తవ్వి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తద్వారా పూడిమడక గ్రామానికి వచ్చే నీటి ముంపు ప్రమాదం నుంచి బయటపడేందుకు ఉప్పు గల్లీ భూములు దోహదపడేవి. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మిగిలిన ఫిషింగ్ హార్బర్ పనుల కారణంగా ఉప్పుటేరుని కుదించేశారు. ఉప్పుటేరు మీదుగా చిన్నపాటి సిమెంట్ గొట్టాలు వేసి రోడ్డుని వేయడంతో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇటు ఉప్పుగల్లీ భూముల బదలాయింపు, మరో వైపు ఉప్పుటేరు ఉనికికి భంగం కలిగే పరిణామాలతో పూడిమడకకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
విష వలయంగా ఉప్పుటేరు
తాజాగా పూడిమడక ఉప్పుటేరులో చేపలు మృత్యువాతకు గురయ్యాయి. సెజ్‌లోని కొన్ని కర్మాగారాల్లో శుద్ధి చేయని రసాయనాలను ఉప్పుటేరులోకి వదలడం వల్లే చేపలు మృత్యువాతకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరి గంగ పుత్రుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో వేచి చూడాలి.

ఉప్పుగల్లీల భూములపై పరిశ్రమల పడగ