
ముంపు తగ్గినా ముప్పు తప్పలేదు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం (బీఎన్) రహదారిలో డైవర్షన్ రోడ్లు నీటి ముంపు నుంచి బయటపడినా ఇంకా ప్రమాదం పొంచి ఉంది. విజయరామరాజుపేట తాచేరు వంతెనపై ఉన్న డైవర్షన్ రోడ్డు పూర్తిగా గండి పడింది. వడ్డాది పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుకు మాత్రం నీటి ఉధృతి తగ్గింది. అయితే కరెంట్ ఆఫీసు పక్క వైపు గండి పడింది. పెద్దేరు నదిలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇంకా డైవర్షన్ రోడ్డుపై నుంచే నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండు డైవర్షన్ రోడ్లకు ఇంకా మరమ్మతులు చేపట్టలేదు. విశాఖ, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం వైపు వెళ్లే వాహనదారులు రవాణా సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వడ్డాది, విజయరామరాజుపేట, మంగళాపురం తదితర గ్రామాల్లో పలు పంటలు నీటి ముంపు నుంచి ఇంకా బయట పడలేదు.
‘తాండవ’లో పెరుగుతున్న నీటిమట్టం
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోందని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నీటిమట్టం సాయంత్రానికి 375.8 అడుగులకు చేరిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో 1800 క్యూసెక్కులు వచ్చి ప్రాజెక్టులో చేరుతోందన్నారు. ప్రస్తుతం తాండవ ప్రధాన గేట్ల ద్వారా పంట కాలువలోకి రోజుకు 310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
‘రైవాడ’ నుంచి 500 క్యూసెక్కులు విడుదల
దేవరాపల్లి: రైవాడ జలాశయం నుంచి స్పిల్ వే గేటు ద్వారా 500 క్యూసెక్కుల వరద నీటిని మంగళవారం సాయంత్రం శారదానదిలోకి విడుదల చేశారు. 7వ నెంబర్ గేటు ద్వారా నీటిని విడుదల చేసినట్లు జలాశయం డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు. జలాశయంలోకి 2000 క్యూసెక్కుల (ఇన్‌ఫ్లో) వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.35 మీటర్లకు చేరుకుంది. శారదానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది దాటే ప్రయత్నం చేయవద్దని డీఈఈ సూచించారు.

ముంపు తగ్గినా ముప్పు తప్పలేదు

ముంపు తగ్గినా ముప్పు తప్పలేదు