
సహనానికి పరీక్ష
కశింకోట:
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల సహనాన్ని పరీక్షిస్తోంది. బస్సులు సరిపోక నిలుచొని ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రద్దీ వల్ల కొన్ని బస్సులు బస్టాపుల్లో నిలపకుండా వెళ్లిపోతుండటంతో ప్రధానంగా విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీ బస్సులు వచ్చే వరకు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల స్కూళ్లు, కళాశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని, తిరుగు ప్రయాణంలో ఇళ్లకు చేరడం ఆలస్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. దీని దృష్ట్యా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఎక్కువ బస్సులు నడపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.
ఆధార్ జెరాక్స్ అనుమతించాలి
ఆధార్ ఒరిజినల్ కార్డు ఉంటేగాని కండక్టర్లు అనుమతించడం లేదని, దీంతో యథావిధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాల్సి వస్తోందంటున్నారు. దీంతో చేతి చమురు వదులుతోందని, ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ జెరాక్స్ కాపీతో కూడా అనుమతించాలంటున్నారు. ఉచిత ప్రయాణానికి ఏ కేటగిరి బస్సులు ఎక్కి ప్రయాణించాలో తెలియడం లేదని, ఈ విషయమై విస్తృత ప్రచారం కల్పించాలంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు మహిళలు ఏ పనీ లేకపోయినా ఉచిత ప్రయాణమని ఉత్సాహంతో అనవసరంగా తిరుగుతూ అతి తక్కువ దూరానికే బస్సులు ఎక్కి, దిగుతుండటం, గమ్యాలకు చేరకుండానే మధ్యలో దిగిపోవడం చేస్తున్నారని, వారికి టిక్కెట్లు ఇవ్వాల్సి రావడం కూడా ఇబ్బందిగా పరిణమిస్తోందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.