
వర్షాలతో వడివడిగా వరినాట్లు
నక్కపల్లి: గడచిన నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు మేలు చేశాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరిసాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. నారు మొలకెత్తినప్పటికీ అవసరమైన నీటి సదుపాయం లేకపోవడం, వర్షాలు పడకపోవడంతో ఆదుర్దా పడ్డ రైతులకు తాజాగా మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అవసరమైన నీరు అందుబాటులోకి రావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. మంగళవారం దేవవరం, చినరామభద్రపురం గ్రామాల్లో ప్రారంభమైన వరినాట్లను జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, మండల వ్యవసాయాధికారి ఉమాప్రసాద్‌లు పరిశీలించారు. పొలాల్లోకి దిగి రైతులతో కలిసి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు మాట్లాడుతూ వరిపంట కాలంలో 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం వేసుకోవాలన్నారు. మొదటి దమ్ము చేసేటప్పుడు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసి దమ్ము చేయడం ద్వారా పచ్చిరొట్ట ఎరువులు కలుపు ఎరువుగా మారతాయన్నారు. సింగిల్ ఫాస్పేట్ వేయకపోతే చివరి దమ్ములో 50 కిలోల డీఏపీ, 15 కిలోల పొటాష్ వేస్తే దుబ్బు చేసే దశ అనగా సుమారు 25 నుంచి 35 రోజుల దశలో కలుపు తీసిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా వేస్తే సరిపోతుందన్నారు. అంకురం దశలో అడుగు పొట్ట దశలో ఉన్నప్పుడు ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పాటాష్ వేయాలన్నారు.