
నక్కపల్లి ఆస్పత్రిలో ఆధునిక వైద్య పరికరాలు
నక్కపల్లి: స్థానిక 50 పడకల ఆస్పత్రిలో ప్రభుత్వ నిధులతో పాటు హెటెరో, డక్కన్ కెంపెనీల సహకారంతో సుమారు రూ.60 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పలు వైద్య పరికరాలు, అభివృద్ధి పనులను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం రూ.17.50 లక్షలతో ఎక్స్‌రే ప్లాంటు, రూ.18.50 లక్షలతో సీఆర్‌ఎం మెషీన్ సమకూర్చింది. హెటెరో కంపెనీ యాజమాన్యం రూ.12.20 లక్షలతో ఆధునిక వసతులతో కూడిన ఎక్స్‌రే గది, ఎల్‌ఈడీ డోరు నిర్మించింది. మరో రూ.7లక్షలు వెచ్చించి పెయింటింగ్స్ వేయించారు. డక్కన్ కెమికల్స్ కంపెనీ యాజమాన్యం రూ.12 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. వీటిని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని వార్డులను ఆమె సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగుల అవసరాలకు తగ్గట్టుగా నక్కపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచుతామన్నారు. అత్యవసర వైద్యం కోసం ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో, డక్కన్ కంపెనీ యాజమాన్యాలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. హెటెరో కంపెనీ ప్రతినిధులు కుళ్లాయిరెడ్డి, రాజారెడ్డి, ఎంవీఎస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.