సామాన్యుడి ‘టోల్‌’ తీస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడి ‘టోల్‌’ తీస్తున్నారు..

Aug 19 2025 4:48 AM | Updated on Aug 19 2025 4:48 AM

సామాన

సామాన్యుడి ‘టోల్‌’ తీస్తున్నారు..

● కార్లు, ఇతర వాహనాలకు తగ్గింపు ● ఆర్టీసీ ప్రయాణికులపై వడ్డింపు

నర్సీపట్నం : కారుల్లో తిరిగే వారికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం..సామాన్య ప్రజలను విస్మరించింది. జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారిలో ధనికులు, మధ్య తరగతి వర్గాలకు ఒక రకంగా, సాధారణ ప్రజలకు మరో రకంగా చూసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కారుల్లో ప్రయాణించే వారికి కొంతైనా భారం తగ్గించిన, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఆర్టీసీ ప్రయాణికుల గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం ఒక పక్క ప్రయాణం కోసం కారుకు రూ.150 వరకు టోల్‌ రుసుం చెల్లిస్తున్నారు. 2000 సంవత్సరం తరువాత రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరణ పెరిగింది. ఈ రహదారులపై ప్రయాణించే ప్రతి వాహనదారుడి నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఏటేటా ఈ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. మొదటిలో రవాణా వాహనాలు, ధనికులు ప్రయాణించే కార్లు మీద మాత్రమే వేసిన టోల్‌ ఛార్జీల భారం తరువాత ఆర్టీసీ బస్సులపైనా పడింది. ఈ బస్సులపై పడిన భారం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులపై వడ్డించడం మొదలు పెట్టింది. టోల్‌ గేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో 5 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలంటే రూ.10 టిక్కెట్‌ ఛార్జీకు అదనంగా మరో రూ.10 టోల్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సుమారుగా లక్ష మంది ప్రయాణం చేస్తున్నారు. వేంపాడు టోల్‌ గేటు మీదగా ప్రయాణించే ప్రయాణికులే రోజుకు దాదాపు రూ.30 వేలు టోల్‌ ఛార్జీలు చెల్లిస్తున్నారు. జిల్లాలో నక్కపల్లి మండలం, వేంపాడు, సబ్బవరం మండలం మర్రిపాలెంలో టోల్‌గేట్లు ఉన్నాయి. నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగొల్లు జంక్షన్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు రెండు కిలోమీటర్ల దూరంలో టోల్‌గేటు అవతల ఉన్న కాగిత గ్రామం ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే రూ.10 టోల్‌ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది.

కార్లపై తగ్గిన భారం...

ఆగస్టు 15 నుంచి కారుల్లో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కొంత భారం తగ్గించింది. కార్లు సొంతంగా వినియోగించుకునే వారు రూ.3 వేలు చెల్లిస్తే 200 సార్లు టోల్‌ గేటు మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కార్డు ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. కార్లను మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. వారిపై పడుతున్న భారం గురించి ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం నిత్యం పల్లె వెలుగు, సిటీబస్సుల్లో తిరిగే రోజు కూలీలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు గురించి ఆలోచించలేదు. టోల్‌గేటు ఉన్న జిల్లా వాహనదారులకు, పరిసర గ్రామాల వాహనదారులకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కొంత రాయితీలు ఇస్తుంది. అదే జిల్లాలో ప్రయాణించే సామాన్య ప్రజలు వినియోగించే పల్లె వెలుగు బస్సుల నుంచి ఎటువంటి మినహాయింపు లేకుండా టోల్‌ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ టోల్‌ భారం తగ్గించి ఊరట కల్పించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

నక్కపల్లి టోల్‌ గేట్‌, (ఇన్‌సెట్‌)

పల్లె వెలుగు బస్సులో ప్రయాణికులు

సామాన్యుడి ‘టోల్‌’ తీస్తున్నారు.. 1
1/1

సామాన్యుడి ‘టోల్‌’ తీస్తున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement