
ఈపీడీసీఎల్‌లో బదిలీల బంతాట!
సర్కిళ్లలో బదిలీలకు సిద్ధమవ్వాలంటూ ఉద్యోగులకు ఆదేశాలు
ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలంటూ మార్గదర్శకాలు
కొత్త సర్కిల్‌కి బదిలీ చేస్తే ఉద్యోగ విరమణ వరకూ అక్కడే విధులంటూ షరతు
ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు జూనియర్లకే
ఎక్కువ ఉండటంతో ఆందోళన
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న
ఉద్యోగ సంఘాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గతంలో జరిగిన జిల్లాల విభజనకు అనుగుణంగా ఈపీడీసీఎల్‌లో సర్కిళ్లను విభజించారు. అయితే ఇప్పుడు ఆయా సర్కిళ్లకు అనుగుణంగా ఉద్యోగులను బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఈ బదిలీల ప్రక్రియలో జూనియర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా బదిలీ అయిన సర్కిల్‌లోనే ఉద్యోగ విరమణ వరకు విధులు నిర్వర్తించాలన్న ప్రభుత్వ షరతుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు కొత్తగా జిల్లాల పునర్విభజన జరగవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడే బదిలీలు చేపట్టవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. అయినా అధికారులు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.
బదిలీ మార్గదర్శకాలపై అసంతృప్తి
రెండేళ్ల కిందట జరిగిన సర్కిళ్ల పునర్విభజనకు అనుగుణంగా బదిలీలు చేసేందుకు ఈపీడీసీఎల్ అధికార యంత్రాంగం సిద్ధమైంది. గతంలో ఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరుతో కలిపి మొత్తం 5 సర్కిళ్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత సర్కిళ్ల సంఖ్య 11కి పెరిగింది. అవి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సర్కిళ్లు. అయితే సర్కిళ్లు విభజించినప్పటికీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
జూనియర్లని బలిచేసేలా మార్గదర్శకాలు.!
సర్కిళ్ల ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నట్లు ఇటీవలే మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కొత్తగా వచ్చిన సర్కిళ్లకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుందని.. ఏ సర్కిల్‌కు వెళ్లాలో నిర్ణయించుకోవాలంటూ ఆప్షన్లు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన ఆరు సర్కిళ్లలో బదిలీలుండనుండగా.. ఉద్యోగి నేస్తం పోర్టల్‌లో ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో జూనియర్లనే ఎక్కువగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం విధించిన షరతు జూనియర్లలో మరింత ఆందోళన రేపుతోంది. ఈ ప్రక్రియలో సీనియర్లకు మాత్రమే ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చారు. దీంతో 90 శాతానికి పైగా సీనియర్లు బదిలీ నుంచి తప్పించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. కొద్దిమంది సీనియర్లు మాత్రమే అనారోగ్యం వంటి కారణాలతో సొంత జిల్లాకు బదిలీ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జూనియర్లకే ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బదిలీ అయిన ఉద్యోగి తన ఉద్యోగ విరమణ వరకు అదే సర్కిల్‌లో పనిచేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ షరతు వల్ల జూనియర్లు పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలో..
జూనియర్ అసిస్టెంట్లు 470
సీనియర్ అసిస్టెంట్లు 626
టైపిస్ట్/యూడీస్టెనో/ఎల్‌డీ స్టెనో 66
సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు 107
పునర్విభజన జరిగితే
మళ్లీ బదిలీలు చేస్తారా?
వచ్చే వారం పది రోజుల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జూనియర్లకు ఇబ్బందులకు గురి చేయకుండా.. పాత పద్ధతిలోనే బదిలీలు చేపట్టాలని, బదిలీలలో పారదర్శకత పాటించాలని కోరుతున్నాయి. మరోసారి జిల్లాల పునర్విభజన జరిగితే కొత్త సర్కిళ్లు ఏర్పడతాయని, అప్పుడు మళ్లీ బదిలీలు చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.