
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
నాతవరం : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సత్వరం నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యుడు గాదె శ్రీనివాసులనాయుడును కోరారు. ఆయన జిల్లేడుపూడిలో బుచ్చెంపేట నూకాలమ్మ తల్లిని దర్శించేందుకు మంగళవారం విచ్చేసిన సందర్భంగా జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ కన్వీనర్ పట్నాల సతీష్, నాతవరం మండల శాఖ జేఏసీ కన్వీనర్ అంకంరెడ్డి శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏళ్లతరబడి పని చేస్తున్నా ప్రభుత్వం జీతాలు పెంచలేదన్నారు. మా సమస్యలపై గతంలో అందోళనలు చేస్తే ప్రధాన సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కనీసం పట్టించుకోలేదన్నారు. కనీసం ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. త్వరలో జరిగే శాసన మండలి సమావేశాల్లో కూడా వారి సమస్యలు ప్రస్తావిస్తానని తెలిపారు. మండలానికి విచ్చేసిన ఎమ్మెల్సీని ఎంఈవోలు బ్రహ్మాజీ, కామిరెడ్డి వరహాలబాబు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయు రాష్ట్ర నాయకుడు డి. గోపీనాథ్, మండల నాయుకులు శెట్టి సుబ్రమణ్యం లాలం శ్రీనివాస్, గుడపర్తి దేముడు, సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు సిహెచ్. వెంకటలక్ష్మి కె.గోవింద్, అరుణజ్యోతి, ఎస్.సత్యవేణి బి.వి.నాయుడు టి.సాంబమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.