
మూడు చోట్ల భారీగా గంజాయి స్వాధీనం
పాయకరావుపేట : జాతీయ రహదారిపై రవాణా చేస్తున్న రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన బైపురెడ్డి రత్నం, తూర్పుగోదావరి జిల్లా రాగంపేట గ్రామానికి చెందిన ఎర్రమిల్లి నాగవీరశివ, కాకినాడ జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన కొళ్ల నాగసతీష్ కలిసి యక్స్ యువి పిడబ్ల్యూడి 500 డబ్ల్యూ 8 మహేంద్ర కారులో జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా విశ్వసనియ సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ వద్ద సీఐ జి.అప్పన్న తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేసి పట్టుకున్నారని తెలిపారు. కారులో నాలుగు బస్తాల గంజాయిని గుర్తించి, కారుతో పాటు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో బైపురెడ్డి రత్నం భర్తకు గతంలో పరిచయం చేసిన నర్సీపట్నానికి చెందిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని 200 కేజీల గంజాయిని సరఫరా చేయడానికి రూ.3 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని పంపించడం జరిగిందన్నారు. రత్నం భర్త రాజు గంజాయి రవాణా కేసులో 5 నెలల క్రితం చైన్నెలో అరెస్టయినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆటోలో ఒడిశా నుంచి గబ్బడ మీదుగా నర్సీపట్నానికి, అక్కడ నుంచి నక్కపల్లి మండలం నెల్లిపూడి వద్ద నిల్వ చేశారని, అనంతరం రాజమండ్రికి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. గంజాయి, కారుతో పాటు, 4 సెల్‌ఫోన్‌లు, రూ.3 వేల నగదు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. సీఐ అప్పన్న, ఎస్‌ఐలు జె.పురుషోత్తం, పోలీసు సిబ్బందిని ఎస్సీ తుహిన్ కుమార్ సిన్హా అభినందించాని తెలిపారు.
ముగ్గురు అరెస్టు..నలుగురు పరార్
నర్సీపట్నం : గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారైనట్టు డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, తిరువళ్ళూరుకు చెందిన తరుణ్ కుమార్ గోపి(24), అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, దోమ లగొంది గ్రామానికి చెందిన గడుగు కొండబాబు(39), చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలానికి చెందిన ఎ.దినేష్(30) గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు పరారయ్యారని, నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. ముందస్తు సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, గొలుగొండ, నర్సీపట్నం రూరల్ ఎస్‌ఐలు రామారావు, రాజారావు, సిబ్బంది వాసుబాబు, సాయి సురేష్, నగేష్ టీమ్ మంగళవారం గొలుగొండ మండలం, కొమిర గ్రామ శివారులో మాటువేసి కారు, ముందు రెండు బైక్‌లపై వస్తున్న ఇద్దరు పైలెట్లను అదుపులోకి తీసుకున్నారు. కారులో 24 కేజీల చొప్పున 9 బస్తాల్లో 216 కేజీల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.50 లక్షలు ఉంటుందన్నారు. ఒడిశా రాష్ట్రం, చిత్రకొండ పోలీసు స్టేషన్
పరిధిలో జనాభాయ్ దగ్గర వారు కేజీ రూ.5 వేలు చొప్పున కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. అక్కడ నుంచి భూసులకోట మీదగా కొమిర గ్రామ శివారుకు తరలించి, అక్కడి నుంచి నర్సీపట్నం మీదుగా తమిళనాడుకు రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితులపై పాత కేసులు ఉన్నాయన్నారు. వారిపై పీడీయాక్టు ప్రయోగించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిందితుల ఆస్తులను సైతం జప్తు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. కేసును చేధించిన సీఐ, ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
బొడ్డరేవు వద్ద 320 కిలోలు...
మాడుగుల రూరల్ : వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీ శివారు బోడ్డరేవు గ్రామ పరిసరాల్లో నిర్వహించిన దాడుల్లో, 320 కిలోల గంజాయిని పట్టుకుని, 16 మంది నిందితులను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి స్థానిక పోలీస్‌స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారైనట్టు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాలివి. ఈ నెల 18 వ తేదీ సోమవారం రాత్రి ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ జి. నారాయణరావు, ఏఎస్‌ఐ, వారి సిబ్బందితో కలిసి బోడ్డరేవు గ్రామ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా ఆటో నెంబరు ఎపి31టిడి2387లో 16 బ్యాగుల్లో 320 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు శంకరం పంచాయితీ శివారు తాడివలస గ్రామానికి చెందిన వారు కాగా, మిగిలిన 14 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారు. ఈ దాడుల్లో గంజాయి రవాణా చేస్తున్న ఆటోతో పాటు మూడు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎ1 నిందితుడు యలమంచిలి పోలీసుస్టేషన్‌లో, ఎ2 నిందితుడు ఎన్‌డీపీసీ చట్టం కింద కేసుల్లో నిందితులుగా వున్నారన్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. నిందితులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి, రిమాండుకు పంపించామన్నారు. విలేకరుల సమావేశంలో కె. కోటపాడు సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ జి. నారాయణరావు పాల్గొన్నారు. ఈ కేసులో పనిచేసిన సిబ్బందిని ప్రశంసిస్తూ నగదు బహమతులను డీఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.

మూడు చోట్ల భారీగా గంజాయి స్వాధీనం