
108 డిఫెన్స్ మద్యం బాటిళ్ల స్వాధీనం
పెదగంట్యాడ: గాజువాక పరిసర ప్రాంతాల్లో అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పెదగంట్యాడ కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నరసింహారెడ్డి అనే వ్యక్తి నుంచి 15 డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నరసింహారెడ్డి గాజువాక బీసీ రోడ్డులోని వెంకటేశ్వర ఫర్నిచర్ దుకాణం యజమాని జీలకర్ర సుబ్బారావు నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ ఫర్నిచర్ దుకాణంలో సోదాలు చేయగా, మొత్తం 108 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ మద్యం ఎక్కడ నుంచి వస్తోందని సుబ్బారావును ప్రశ్నించారు. నేవల్ అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా మద్యం సీసాలను ఇస్తారని సుబ్బారావు చెప్పాడు. ఈ కేసులో నరసింహరెడ్డి, జీలకర్ర సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని గాజువాక ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.