
భావితరాలకు స్ఫూర్తి గౌతు లచ్చన్న
గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి : స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరానికి సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయుల జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తను నమ్మిన సిద్దాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని ఆమె చెప్పారు. 1978 లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, పీఏసీ చైర్మన్‌గా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా విశేష సేవలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికార అధికారి కె. శ్రీదేవి, సహాయ వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారి వి.గోపి సాధూరావు పాల్గొన్నారు.