
గౌతు లచ్చన్నకు ఘన నివాళి
గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న విత్తనాల పోతురాజు
అనకాపల్లి: స్వాతంత్య్ర పోరాట యోధుడు, మాజీ మంత్రి గౌతు లచ్చన్న ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని శెట్టి బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు విత్తనాల పోతురాజు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం లచ్చన తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రైతుల కోసం ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ 700 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన మహానీయుడు లచ్చన్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రెడ్డి సన్యాసిరావు, పీత నానాజీ, బత్తిన సూర్యారావు, బొక్క నాగేశ్వరరావు, చప్పడి ఆంజనేయులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, నాయకులు మాధవరావు, ఎన్.సత్యనారాయణ, మద్దాల బాబు, వై.ఎన్.భద్రం, తదితరులు పాల్గొన్నారు.
పాడి పశువుల పట్ల జాగ్రత్తలు అవసరం
మాడుగుల: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పాడి రైతులు తమ పశువుల పట్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మాడుగుల ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ వి.చిట్టినాయుడు సూచించారు. పశువులను పాకల్లో తాళ్లతో గట్టిగా కట్టరాదన్నారు. నీరు ఎక్కువగా ఉండే గుంటలు, చెరువులు, జలాశయాత వద్దకు పశువులు, గొర్రెలు, మేకలను తోలుకెళ్లొద్దని సూచించారు. పశువులను విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లను ఎత్తయిన ప్రదేశాలకు తరలించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే పాడి రైతులు తమ గ్రామంలో వీఆర్‌వో, లేదా పశుసంవర్థక శాఖ సహాయకుడి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు తుపాను సమయంలో మరణిస్తే 24 గంటల వ్యవధిలో సమీపంలోని పశు సంవర్థక శాఖ సహాయకులు లేదా పశువైద్యశాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.