
సమగ్ర పురోగతి దిశగా..
మహనీయుల అడుగుజాడల్లో..
సాక్షి, అనకాపల్లి: ఎందరో దేశభక్తులు, మహనీయులు వీరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతావనిని మనకు అందించారని, వారి ఆశయాల బాటలో పయనిద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతి సాధించేలా కృషి చేద్దామని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోం మంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం త్రివర్ణ పతాకానికి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా, పోలీస్ బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మూడు రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి, పోలీస్ గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీ4 కార్యక్రమం ద్వారా గుర్తించిన 53 వేల నిరుపేద కుటుంబాలను దాతల సాయంతో ఆదుకుంటామని చెప్పారు. జిల్లాలో 2.43 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.161.45 కోట్లు అందించామన్నారు. దీపం–2 కింద మొదటి విడతలో 3.23 లక్షల మంది, రెండో విడతలో 3.4 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు.
● ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 2.7 లక్షల వేతనదారులకు రూ.234.7 కోట్ల ఉపాధి
● 2.58 లక్షల మందికి సామాజిక పింఛన్ల పంపిణీ
● 23 గిరిజన గ్రామలకు రూ.125.08 కోట్లతో 23.13 కి.మీ రహదారులనిర్మాణం
● అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 15,462 మంది గర్భిణులు, బాలింతలకు, 51,593 మంది పిల్లలకు రూ.96 కోట్లతో పోషకాహారం
● బీసీ కార్పొరేషన్ ద్వారా 2265 మందికి మహిళలకు 19 సెంటర్ల ద్వారా కుట్టుమిషన్ శిక్షణ
● ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 4331 మంది ఆరోగ్యశ్రీ సేవలకు రూ.8.37 కోట్ల చెల్లింపు
● పంచాయతీరాజ్ శాఖలో 1734 సీసీ రోడ్లు మంజూరు కాగా 1371 రోడ్లు పూర్తి
● పీఎం ఆవాస్ యోజన పథకంలో 62,498 ఇళ్లకు గానూ 32,823 ఇళ్ల నిర్మాణం పూర్తి
● రూ.45 కోట్లతో 130 భారీ, మెగా తరహా పరిశ్రమల స్థాపన
● నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో 3,257 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వివిధ పాఠశాలలకు చెందిన 11 విద్యార్థి బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాయి. వందేమాతరం గీతంతో మాతా శిశు సంక్షేమ శాఖ, చిల్డ్రన్‌హోంకు చెందిన చిన్నారులు ప్రదర్శన ప్రారంభించారు. నర్సీపట్నంలోని మాతా శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోమ్ చిన్నారుల బృందానికి మొదటి బహుమతి, అచ్యుతాపురం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు రెండో బహుమతి, కశింకోట ఐడబ్ల్యూహెచ్‌సీ బాలికల పాఠశాల విద్యార్థులకు మూడో బహుమతి లభించాయి. అన్ని ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
422 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 422 మంది అధికారులు, ఉద్యోగులు, పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కలెక్టర్, జేసీ, ఎస్పీలతో కలిసి హోం మంత్రి అనిత వాటిని ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వి.వి.రమణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కె.బాలాజీ, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
పేదరికాన్ని
నిర్మూలిద్దాం
అన్ని రంగాల్లో ప్రగతి సాధిద్దాం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన
హోం మంత్రి అనిత
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల శకటాలు
డీఆర్‌డీఏ శకటానికి ప్రథమ బహుమతి
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) శకటం ప్రథమ బహుమతిని సొంతం చేసుకోగా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) శకటం ద్వితీయ బహుమతి, రవాణా, పరిశ్రమలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలు మూడో బహుమతి సొంతం చేసుకున్నాయి. విద్యుత్, పట్టు పరిశ్రమ, విద్య, భూగర్భ గనులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ శాఖలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, జిల్లా క్రీడా సాధికార సంస్థ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ స్టాళ్లు ఏర్పాటు చేశారు.

సమగ్ర పురోగతి దిశగా..

సమగ్ర పురోగతి దిశగా..