
దొంగ ఓట్లతో గెలిచి సంబరాలా?
● జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
● మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు ధ్వజం
దేవరాపల్లి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచి, టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అడుగడుగునా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీస్, పోలింగ్ అధికార్లు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి ఓటర్ల స్లిప్‌లను లాక్కొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకొన్నారని, వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి పోలింగ్ కేంద్రాలను నుంచి వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి సహా ఇతర నాయకులుందర్నీ హౌస్ అరెస్టు చేసి అన్ని పోలింగ్ కేంద్రాలను హస్తగతం చేసుకొని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల జరిగే ప్రాంతంలోని వారితో కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారని, ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫోటోలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ఆధారాలు, సాక్ష్యాలను బయటపెట్టినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార టీడీపీకి అంత ప్రజాబలం ఉంటే ఇంతగా బరితెగించి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు.