
చెట్టు కూలి బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి
పాయకరావుపేట రోడ్డు పక్కన వున్న పెద్ద చెట్టు పడి డెక్కన్ కెమికల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. సీఐ జి.అప్పన్న అందించిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, దూళ్లపేటకు చెందిన తోట శ్రీనివాసరావు (34) అనే వ్యక్తి డెక్కన్ కెమికల్స్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్‌గా ఇఅండ్‌హెచ్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. శ్రీనివాసరావు గురువారం ఉదయం ఉద్యోగరీత్యా కంపెనీకి వెళ్తున్నాడు. రాంభద్రపురం దాటిన తర్వాత రోడ్డుకి కుడివైపున వున్న పెద్ద గన్నెరు వృక్షం ఉదయం 8.30 గంటల సమయంలో నేలకొరిగి బైక్ పై వెళ్తున్న శ్రీనివాసరావుపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావుతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న మరో ఉద్యోగి ప్రమాదం నుంచి తప్పించుకోగా, స్వల్పగాయాలయ్యాయి. అతనిని తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చెట్టు కింద పడి ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని రోడ్డును తొలచి బయటకు తీశారు. తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. డెక్కన్ కెమికల్స్ యాజమాన్యం పడిపోయిన చెట్ల క్రేన్ సహాయంతో తొలగించారు.

చెట్టు కూలి బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి