
రూ.లక్ష విలువ చేసే టేకు దుంగలు పట్టివేత
కోటవురట్ల : అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. నర్సీపట్నం ఫారెస్టు రేంజరు రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం..టేకు కలప అక్రమంగా రవాణా అవుతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఫారెస్టు రేంజరు రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బంది యండపల్లి వద్ద బుధవారం రాత్రి నిఘా వేశారు. ఎటువంటి అనుమతి లేకుండా టేకు దుంగలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. వాహనం దాలింపేట కర్రల మిల్లు యజమాని శ్రీరామ్మూర్తికి చెందినదిగా గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఫారెస్టు రేంజరు రాజేష్ మాట్లాడుతూ కొంత కాలంగా అక్రమంగా టేకు కలప రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో దాడి చేసినట్టు తెలిపారు. పట్టుబడిన టేకు కలప విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా అక్రమంగా కలప రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా కర్రల మిల్లుల వ్యాపారులు అనధికారికంగా కలపను నిలువ చేస్తే కర్రల మిల్లు లైసెన్సు రద్దుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు.