
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ క్రమంలోనే అచ్యుతాపురం ఎస్‌టీబీఎల్‌లో అద్దెకు నివాసముంటున్న కొండల గాయత్రి (21) బుదవారం ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మన్యం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన మృతురాలు గాయత్రికి 2024 మార్చ్ నెలలో శంకర్రావుతో వివాహమైంది. గాయత్రి భర్త అచ్యుతాపురం ఎంఎస్‌ఎంఈలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గాయత్రి భర్త ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ రీత్యా విధులకు హాజరై తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి గాయత్రి వంటగదిలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెంది ఉండడం గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మృతురాలు గర్భం పోవడంతో పలుమార్లు ఇరుగు పొరుగు వారితో తన గర్భం పోయిందని చెబుతూ ఆవేదన చెందినట్టు విచారణలో తెలిసిందన్నారు. అయితే క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్న కారణంగానే ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసి ఇతర కారణాలపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.