
శ్మశానవాటికలో పచ్చనేత పాగా!
చోడవరం :
అధికారపార్టీ నాయకుల భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూలేకుండా పోతోంది. బంజరు భూములు, కొండగెడ్డలే కాకుండా ఏకంగా శ్మశాన స్థలాన్నే ఆక్రమించడానికి పూనుకున్నాడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. ఇతడి ఆక్రమణ నుంచి తమ శ్మశానాన్ని రక్షించాలని కోరుతూ చోడవరం తహసీల్దార్‌కు, ఎమ్మెల్యేకు స్థానికులు గురువారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...చోడవరం మండలం గవరవరం గ్రామంలో మూడు శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో ఒకటి కొన్ని వీధుల వారు వినియోగించుకోవడానికి కేటాయించారు. దీనిని గతంలో కొందరు ఆక్రమించుకోగా గ్రామస్తులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు గ్రామస్తులకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి యధావిధిగా ఈ శ్మశానవాటికను గ్రామస్తులు వినియోగిస్తున్నారు. తాజాగా ఈ శ్మశాన వాటికలో కొంత భాగాన్ని ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చప్పగడ్డ వెంకటస్వామినాయుడు ఆక్రమించుకొని బడ్డీలు ఏర్పాటు చేశాడు. దీంతో గ్రామస్తులు తిరుగుబాటు చేసి ఆయనను ప్రశ్నించారు. ఈ స్థలాన్ని తాను గుండుపు నారాయణమ్మ అనే వాళ్ల దగ్గర కొనుగోలు చేశానంటూ సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో గ్రామస్తులను ఎదిరించి టీడీపీ నాయకుల బడ్డీలు కూడా పెట్టాడు. దీనిపై గ్రామస్తులు చోడవరం తహాసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం ఇచ్చి తమ శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని, సర్వే చేసి రికార్డులు పరిశీలించి సర్వే చేసి న్యాయబద్దంగా స్థలాన్ని అప్పగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిగారు. ఇదిలావుండగా గ్రామస్తుల తరపున గతంలో కోర్టుకు వెళ్లి ఈ స్థలం గ్రామానికి చెందిన శ్మశాన వాటికదే అని పోరాటం చేసిన వారిలో ఇదే మాజీ సర్పంచ్ కూడా ఉన్నారని, తీరా అధికారం వచ్చాక ఆయనే ఆ శ్మశాన స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు హెచ్చరించారు.

శ్మశానవాటికలో పచ్చనేత పాగా!