
జటిలంగానే పైడమ్మ చెరువు వివాదం
రాంబిల్లి (అచ్యుతాపురం): వాడనర్సాపురానికి ఆనుకుని ఉన్న పైడమ్మ చెరువు వివాదం జటిలంగానే ఉంది. 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువే ఇప్పుడు వాడనర్సాపురంతో పాటు 21 గ్రామాల ప్రధాన నీటి వనరు. ఆయా గ్రామాల మీదుగా ప్రవహించే వరద నీరు ఈ చెరువుకే చేరుతోంది. నీటి పారుదల శాఖ పరిధిలో ఉండే ఈ చెరువును బుధవారం చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నేవల్ బేస్ అధికారులు, డీజీఎన్‌పీ సిబ్బంది ప్రయత్నించడంతో వాడనర్సాపురం వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిపాటి వాగ్వాదంతో కూడిన చర్చలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో చెరువుపై హక్కులు వదులుకునేది లేదని స్థానిక మత్స్యకారు చెబుతున్నారు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం రెవెన్యూ శాఖ ద్వారా దఖలు పడిన ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి తీరాలని డీజీఎన్‌పీ ధృడ నిశ్చయంతో ఉండటంతో వివాదం కొలిక్కి రాలేదు. కాగా గ్రామస్తుల ఆమోదం, పంచాయతీ తీర్మానం లేకుండా చెరువును దఖలు పరచడం కుదరదని పేర్కొనడంతో గురువారం పోలీసుల సమక్షంలో ఫెన్సింగ్ పనులు ప్రారంభించాలని నేవల్ బేస్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి ఈ గ్రామస్తులకు ఫోన్లు వెళ్లాయి. స్టేషన్‌కు వచ్చి కలవాలని, శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో గ్రామస్తులు సైతం తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కలిసి సమస్యను వివరించిన వాడనర్సాపురం వాసులు రెండవ విడతలో గ్రామాన్ని తరిలిస్తే తప్ప చెరువును వదులుకోబోమని పట్టుబడుతున్నారు. తీర ప్రాంతంలో ఆంక్షలు, శారదా నదిలోకి వెళ్లేందుకు ఉన్న అడ్డంకుల నేపథ్యంలో ఉన్న చెరువుని ఎలాగైనా తమకు వనరుగా ఉంచుకోవాలని స్థానికులు ఆశించడంలో ఎటువంటి తప్పు లేదని ప్రజా సంఘాల వాదన.
ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం..
పైడమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నేవల్ బేస్ సిద్ధం కావడం, ఈ మేరకు పోలీసుల సహకారం కోరడం వంటి పరిణామాలతో గురువారం పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉన్న నేవల్ బేస్ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలను సైతం కొన్ని సందర్భాల్లో పట్టించుకోరు. అదే సమయంలో సున్నితమైన తమ భవితవ్యం విషయంలో రాజీపడే ధోరణిలో మత్స్యకారులు లేరు. ఈ క్రమంలోనే బుధవారం చర్చలు సాఫీగా సాగి నేవల్ బేస్, డీజీఎన్‌పీ సిబ్బంది వెనక్కి వెళ్లినప్పటికీ గురువారం మళ్లీ పనులు మొదలు పెట్టే పరిస్థితి కనిపించడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలయింది. సహజంగా తీర ప్రాంత వాసులు కాస్త ఉద్వేగంగానే ఉంటారు. అదే సమయంలో తమ ఉనికి, భవితవ్యానికి సంబంధించిన అంశం కావడంతో ఎంతకై నా పోరాడే తత్వం కలిగి ఉంటారు. మత్స్యకారుల జీవన ఆధారం, ఉన్నతాఽధికారుల పట్టుదల వంటి పరిణామాలతో పరిస్థితి ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. రెండు వర్గాలను నియంత్రించగలిగే వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పవచ్చు.
మళ్లీ ఫెన్సింగ్ పనుల్ని అడ్డుకున్న వాడనర్సాపురం వాసులు
తమ గ్రామం ఉన్నంత కాలం చెరువుని వదులుకోబోమని పునరుద్ఘాటన
వెనుదిరిగిన నేవల్ బేస్, డీజీఎన్‌పీ సిబ్బంది
నేడు పోలీసుల సమక్షంలో పనులు చేపట్టే అవకాశం