
కార్పొరేట్ సంస్థలతో రైతులకు అన్యాయం
అనకాపల్లి: మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే దేశంలో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని సంయుక్త కిసాన్ రైతు మోర్చా, రైతు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పట్టణ పురవీధుల గుండా రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాల్ని మారుస్తుందన్నారు. కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని, పది సంవత్సరాలు దాటిన ట్రాక్టర్లపై నిషేధాన్ని తొలగించాలని, రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానం ఆపాలనే డిమాండ్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ రైతు మోర్చా జిల్లా కన్వీనర్ కర్రి అప్పారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, రైతు కూలీ సంఘం కన్వీనర్ కోన మోహన్, జిల్లా వృత్తిదారుల కన్వీనర్ గంటా శ్రీరామ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, ఎస్‌వీ నాయుడు, తేలయ్య బాబు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.