
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
అనకాపల్లి టౌన్: గంజాయి కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్‌పీ శ్రావణి తెలిపారు. స్థానిక డీఎస్‌పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బెంగళూరుకు చెందిన మోహన్ (39), మిధున్ (21), అరవింద్(23), మనోజ్ కుమార్ (24) ఈ నెల 11న కారులో బెంగళూరు నుంచి అరకు చేరుకుని 17 కిలోల గంజాయి కొన్నారని తెలిపారు. దాన్ని బెంగళూరులో అధిక ధరకు అమ్మాలని రోడ్డు మార్గంలో వెళ్తుండగా బట్టపూడి గ్రామం వద్ద తనిఖీల నేపథ్యంలో పోలీసులను చూసి కారు వేగంగా నడిపారన్నారు. దీంతో అనుమానం వచ్చి కారును అడ్డగించి పోలీసులు సోదా చేశామన్నారు. కారు డిక్కీలో ఉన్న గంజాయి, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను బుధవారం కోర్టుకు హాజరు పరిచినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ఎస్‌ఐ జి. రవికుమార్, హెచ్‌సీ సోంబాబు, పీపీలు శంకర్, వెంకట్రావులను డీఎస్‌పీ అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జి. అశోక్‌కుమార్ పాల్గొన్నారు.