
గంగాదేవిపేట వద్ద ఆటో–కారు ఢీ
మునగపాక: మండలంలోని గంగాదేవిపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన ఆటో ప్రయాణికులతో అనకాపల్లి వెళ్తుండగా అదే సమయంలో మునగపాక మండలం తిమ్మరాజుపేటకు చెందిన కారు అనకాపల్లి నుంచి మునగపాక వైపునకు వస్తోంది. కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆటోకు కూడా నష్టం వాటిల్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.