నేడు వెన్నుపోటు దినం
యలమంచిలి రూరల్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని, నాడు ఎన్టీఆర్‌కు.. నేడు సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు నయవంచనకు నిరసనగా ఈ నెల 4వ తేదీ బుధవారం వెన్నుపోటు దినం పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అడ్దగోలుగా విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడు ద్వారా మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. 2024లో ప్రజలను మోసం చేయడం ఇష్టం లేకనే ఆయన ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వలేదన్నారు.
ఎన్నికల హామీలు తుంగలో..
కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, లేదంటే రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తానని బాబు చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి. సేనాపతి రాము, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు పాల్గొన్నారు.
కూటమి వంచనను నిలదీద్దాం
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ


