అర్జీల పరిష్కారం తూచ్..
తుమ్మపాల: అర్జీదారులపై అధికారులకు కరుణే లేదు.. సమస్యలు పరిష్కరిస్తారని గంపెడాశతో వస్తే కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారే గానీ పట్టించుకోవడం లేదు.. అని కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు అర్జీదారులు తమ ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు తమ గోడును విన్నవించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చారు. వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చినప్పటికి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని, విధుల్లో భాగంగా ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ ద్వారా అర్జీలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెంది పురుగులు మందులు, పెట్రోల్ వంటి ప్రాణాంతక పదార్థాలు వెంట తెచ్చుకుని అధికారులు, కలెక్టరేట్ పరిసరాలలో ఆత్మహత్యా యత్నాలతోపాటు పలు రకాల నిరసనలకు తెగిస్తున్నారు.
ఆలస్యంగా పీజీఆర్‌ఎస్...
● పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉన్నప్పటికి అధికారుల రాక ఆలస్యమవడంతో అర్జీదారులు కొంత సమయం క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
● యలమంచిలి 10వ వార్డు సచివాలయం పరిధిలో అర్హత ఉండి పింఛన్లు మంజూరు కావడం లేదంటూ 40 మందికిపైగా అర్హులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పింఛన్ల పథకంలో అర్హులుగా తమను చేర్చాలని అర్జీలు అందజేశారు.
● పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి స్వీకరించారు. మొత్తం 370 అర్జీలు నమోదయ్యాయి.
దివ్యాంగులకు ఉచితంగా ఇల్లు కట్టివ్వాలి
నిరుపేదలైన అనేక మంది దివ్యాంగులకు ప్రభుత్వమే కాలనీ నిర్మించి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇల్లుతోపాటు కరెంటు, నీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని శ్రీరామ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు విన్నవించారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పథకాలు అమలు చేయాలి
నెలకు రూ.13 వేల జీతంతో జీవించే తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పథకాలు కట్ చేసి మరింత నిరుపేదలను చేస్తున్నారని జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు వాపోయారు. నెలకు రూ.30 వేలకుపైగా జీతం పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులకు అన్ని పథకాలు వర్తించినట్లే తమకు అమలు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
కరెంటు, మంచినీళ్లూ ఇవ్వండయ్యా..
ప్రభుత్వ ఆర్థిక సాయంతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఊర్లో అందరికి ఇంటింటి కుళాయిలు వేశారు. మా ఇంటికి మాత్రం వేయలేదు. దూరం నుంచి బిందెలతో నీరు తెచ్చుకోవడం కష్టంగా ఉంది. కరెంటు మీటరు కోసం రూ.1,800 చెల్లించినప్పటికి కనెక్షన్ ఇవ్వలేదు. న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా – పల్లా అర్జునమ్మ,
తురకలపూడి, బుచ్చెయ్యపేట మండలం
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో మా మొర వినడం లేదు
పలుమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు
కార్యాలయాల చుట్టూ తిరగలేక చస్తున్నాం
అర్జీదారుల ఆవేదన, అసహనం
అర్జీల పరిష్కారం తూచ్..
అర్జీల పరిష్కారం తూచ్..


