భూ సేకరణకు రైతులతో ఆర్‌డీఓ సమావేశం
అచ్యుతాపురం రూరల్ : దొప్పెర్ల గ్రామంలో శనివారం అనకాపల్లి ఆర్‌డీఓ షేక్ ఆయీషా భూ–సేకరణ విషయమై రైతులతో సమావేశమయ్యారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ సమాచారం లేకుండా సుమారు 13 ఎకరాల జిరాయితీ భూమి బార్క్ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారని రైతులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో మీ భూమి ఎంతైతే ఉందో దానికి వెల కట్టి రేటు నిర్ణయిస్తామన్నారని రైతులన్నారు. ఇదంతా ఒకవైపే మాట్లాడుతున్నారే తప్ప అసలు రైతు అభిప్రాయం ఏమిటని అడగలేదని రైతులు ఆవేదన చెందారు. సర్వే నంబర్లు 157, 158, 161, 162, 163గల జిరాయితీ భూమి ప్రభుత్వానికి కాకుండా బార్క్ పరిశ్రమకు ఇవ్వాలనడం ఏమిటని రైతులు ఆలోచనలో పడ్డారు. భూమి ప్రభుత్వానికి కాకుండా బార్క్ ఇవ్వాలని చెప్పడానికి అధికారులు రావడం ఏమిటని రైతులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవేళ భూమి ప్రభుత్వానికి అవసరమై తీసుకున్నట్టయితే రైతుల డిమాండ్ ప్రకారం డీ–పట్టాకై తే ఎకరా రూ.60లక్షలు, జిరాయితీ భూమికి రూ.2 కోట్లు, ఆర్ కార్డులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, ఇంటి స్థలాలతో ఒప్పందానికి చర్చలు జరిపి రైతులందరి అంగీకారంతో ప్రభుత్వానికి ఇస్తామన్నారు. ప్రజలకు అధికారులు సరైన అవగాహన కల్పించకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని రైతులన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరహాలు, ఆర్‌ఐ ఈశ్వర్, మండల సర్వేయర్ రాధ, దొప్పెర్ల ఎంపీటీసీ పల్లి వెంకటరావు, రైతులు పల్లి శేషగిరిరావు, కొల్లి వరహాలరావు, కొల్లి సన్నిబాబు పాల్గొన్నారు.


