వెలవెలబోయిన కలెక్టరేట్
● అర్జీదారులు లేక
మధ్యాహ్నం 12 గంటలకే ఖాళీ
● డీఆర్వో ఆధ్వర్యంలో అర్జీల స్వీకరణ
తుమ్మపాల: నర్సీపట్నంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు కలెక్టర్ విజయ కృష్ణన్ వెళ్లిపోవడంతో అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం బోసిపోయింది. అర్జీదారులు అంతంతం మాత్రంగా వచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే అధికారులు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ వారం కూడా కలెక్టరేట్ సిబ్బంది దివ్యాంగులను లోపలికి రానీయలేదు. దీంతో వారంతా గంటల పాటు అధికారుల కోసం బయటే నిరీక్షించారు. అర్జీల్లో అధికంగా పునరావృతమయ్యాయి. అధికారులు చెప్పే సమాధానమే సమస్య పరిష్కారంగా చూపి అర్జీని ముగించేస్తున్నారని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని పలువురు వాపోతున్నారు.
త్వరితగతిన సమస్యల పరిష్కారం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్(ఏపీఐఐసీ) మనోరమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతుల అర్జీలను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి నేరుగా స్వీకరించారు.
తల్లి మృతికి కారకులపై విచారణకు డిమాండ్
తన తల్లి మృతికి కారణమైన వారిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన ఆవాల సురేష్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయి తీ ఉందంటూ తనను రావాలని చెప్పి సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన ఇంటికి వెళ్లి తల్లి అవాల లక్ష్మిని గాయపరిచారని, వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించినా ఫలితం లేదన్నారు. నిందితులకు సహకరిస్తున్న ఎస్‌హెచ్‌వోను బదిలీ చేసి, విచారణ చేపట్టాలని కోరారు.
సోదరుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
పసుపు, కుంకుమ కింద తన తండ్రి రాసిచ్చిన భూమిలోకి సోదరుడు రానివ్వడం లేదంటూ కోటవురట్ల మండలం టి.జగ్గంపేటకు చెందిన దివ్యాంగురాలు వంటాకుల వేణమ్మ ఫిర్యాదు చేశారు. టి.జగ్గంపేట రెవెన్యూ సర్వే నంబర్ 73/2ఏలో కొంత భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసినప్పటికి సోదరుడు అప్పలనాయుడు రానివ్వడం లేదన్నారు. తన తండ్రి మరణించడంతో అనాథను అయ్యానని, న్యాయం చేయాలని వేడుకున్నారు. గతేడాది కూడా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.
గతేడాదిలో మంజూరైన బిల్లు చెల్లించాలి
గత ప్రభుత్వంలో మంజూరైన విలేజ్ హెల్త్ కేంద్రాన్ని నిర్మించానని, అందుకు సంబంధించిన రూ.7.5 లక్షల బిల్లును తక్షణమే చెల్లించాలని కోరుతూ సబ్బవరం మండలం మొగలిపురానికి చెందిన మొల్లి నాయుడు అర్జీ అందజేశారు. 2024 నవంబర్‌లో మంజూరైన బిల్లు నేటికీ చెల్లించకుండా పంచాయతీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికి అనేక సార్లు వినతులు అందజేశానని, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికై న అధికారులు స్పందిచి న్యాయం చేయాలని కోరారు.
వెలవెలబోయిన కలెక్టరేట్


