ఉజ్వల విశాఖ.. కొత్త ఇమేజ్‌తో మహా నగరం

విద్యుత్‌ వెలుగుల్లో విశాఖ నగరం - Sakshi

మూడు నెలల్లో నాలుగు కీలక అంతర్జాతీయ సదస్సులు

వేదికగా నిలిచిన మహా నగరం

పెట్టుబడుల సదస్సుతో వాణిజ్య కేంద్రంగా వైజాగ్‌

తీపి జ్ఞాపకాలనందించిందన్నజీ–20 దేశాల ప్రతినిధులు

సాక్షి, విశాఖపట్నం : పరిపాలన రాజధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్‌.. అంటే ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్‌ చేశారు. మూడు నెలల వ్యవధిలో నాలుగు అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి... ప్రతి సదస్సును విజయవంతంగా నిర్వహించిన విశాఖ నగరం.. దేశ విదేశీ ప్రతినిధుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఐటీ సదస్సులతో టెక్నాలజీ ఐకాన్‌ సిటీగా పేరొందిన నగరం.. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించిన తర్వాత పెట్టుబడులకు స్వర్గధామంగా మారగా.. నాలుగు రోజుల పాటు నిర్వహించిన జీ–20 సదస్సుతో అందరి నోటా ఒకే మాట.. దేశానికి ఆర్థిక కోట.. విశాఖ.. అనే ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు రోజుల పాటు ఆతిథ్యమిచ్చిన వైజాగ్‌.. మంచి జ్ఞాపకాల్ని అందించిందంటూ విదేశీ ప్రతినిధులు చెబుతుండటం విశేషం.

అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో అగ్రభాగంలో ఉన్న విశాఖపట్నంలో ఏ సదస్సు నిర్వహించినా.. సూపర్‌ సక్సెస్‌ అవుతుందన్నది మరోసారి నిరూపితమైంది. ప్రణాళికా బద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు జీ20 సదస్సు నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా.. కానరాని ఇమేజ్‌.. ఈ ఏడాది నిర్వహించిన సదస్సులతోనే సొంతం చేసుకుంది. జీఐఎస్‌తో వైజాగ్‌ పేరు ఖండాంతరాలు దాటగా జీ20తో విశ్వవ్యాప్తమైంది. ఈ ఏడాది తొలినాళ్లలో రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ(ఐటాప్‌) ఆధ్వర్యంలో ‘ఇన్ఫినిటీ వైజాగ్‌’ సదస్సు నిర్వహించారు. అనంతరం గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ రెండు సదస్సులకు 40కి పైగా దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు హాజరై వైజాగ్‌ సిటీ వైభవాన్ని చూసి ముగ్ధులయ్యారు. వైజాగ్‌.. ఐటీ రంగానికి డెస్టినేషన్‌ అని కొనియాడారు.


జీఐఎస్‌ను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌, చిత్రంలో రిలయన్స్‌ అధినేత అంబానీ, తదితరులు (ఫైల్‌)

జీఐఎస్‌తో కొత్త ఇమేజ్‌..
రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించిన తర్వాత నగరానికి సరికొత్త ఇమేజ్‌ వచ్చింది. విశాఖపట్నం సమగ్రాభివృద్ధి చేసేందుకు ఎంతో అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు వచ్చినా ఆహ్వానించదగ్గ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న నగరంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్న ఆలోచనలు పారిశ్రామికవేత్తలు స్వయంగా చూసిన తర్వాత రూడీ చేసుకున్నారు. నివాస యోగ నగరాల్లో టైర్‌–1 సిటీలతో పోటీ పడుతున్న విశాఖపట్నం పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు కూడా విశాఖ జిల్లాలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చాయంటే దీనికి కారణం.. వైజాగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నది జగమెరిగిన సత్యం.

జీ–20తో అంతర్జాతీయ ఖ్యాతి
భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్‌ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూసేలా చేస్తున్నాయి. జీఐఎస్‌ విజయవంతం అనంతరం నాలుగు రోజుల పాటు జరిగిన జీ20 సదస్సు అద్భుతంగా జరిగింది. నగరాల అభివృద్ధి, ఆర్థిక పురోగతి, నిధుల సమీకరణ తదితర అంశాలపై సెషన్లు నిర్వహించారు. అనంతరం నగర పర్యటనలో భాగంగా జీ20 దేశాల ప్రతినిధులు నగర సందర్శన చేశారు.

నగర అభివృద్ధికి చిహ్నంగా వినూత్నంగా ప్రాజెక్టులు నిర్వహించడాన్ని విదేశీ ప్రతినిధులు ప్రశంసించారు. మార్చి 28న సదస్సు ప్రారంభం రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై.. విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విశాఖ నుంచి వెళ్లేటప్పుడు మధురమైన జ్ఞాపకాల్ని తీసుకెళ్తారని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లుగా.. జీ20 సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. అదే ఫీలింగ్‌తో బయలుదేరారు. సదస్సు విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా అధికారయంత్రాంగం, పోలీసులకు కలెక్టర్‌ డా.మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top