ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో పసికందు మృతి | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో పసికందు మృతి

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

● రెండు రోజులుగా వైద్యం కోసం తిరిగినా సమస్య గుర్తించేదని తండ్రి ఆరోపణ ● వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన

అనకాపల్లి టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా, వైద్యుల నిర్లక్ష్యంతో తమ ఏడాది పసికందును కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి పరమేష్‌, సుగుణ దంపతుల ద్వితీయ కుమార్తెకు జలుబు, కొద్దిగా ఆయాసం రావడంతో గత నెల 29న ఆసుపత్రికి తీసుకురాగా ట్రీట్‌మెంట్‌ చేసి మందులు ఇచ్చి పంపించేశారు. అలాగే ఈనెల 1న ఉదయం మళ్లీ తీసుకువచ్చారు. ఫరవాలేదు. మందులు వాడండి అని పంపిచేశారు. మళ్లీ లక్ష్మివారం రాత్రి ఏడు గంటల సమయంలో చిన్నారికి ఊపిరి సమస్య ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే సకాలంలో సిబ్బంది స్పదించక, వైద్యం అందక, చిన్నారికి ఉన్న అసలు సమస్యను స్పష్టంగా చెప్పక తమ పాప మృతి చెందిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాపకు ఆక్సిజన్‌ పెట్టాలని తీసుకు వెళుతుండగా, పరిస్థితి విషమించిన అనంతరం పాప మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రెండు రోజులుగా వైద్యం కోసం తిరిగినా పాప ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆసుపత్రి ఆవరణలో గ్రామానికి చెందిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పాప మరణానికి కారకులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని, వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పాప తండ్రి ఆటో డైవర్‌ కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి ప్రథమ సంతానం నాలుగేళ్ల పాప చరణి ఉంది. రెండో సంతానంగా పుట్టిన పాపకు 15 రోజుల క్రితమే పుట్టిన రోజు చేశామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్‌ను వివరణ కోరగా విచారణ జరిపి సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement