● ప్రత్యేకాధికారి ప్రదీప్‌కుమార్
ముంచంగిపుట్టు: ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జీ అసిస్టెంట్ డైరెక్టర్, పాఠశాల ప్రత్యేక అధికారి లావేటి ప్రదీప్ కుమార్ సూచించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆయన గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. అలాగే కొందరు విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రసంగ నైపుణ్యం, సృజనాత్మకతను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ప్రదీప్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


