కశింకోట: మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను పట్టుకొని గురువారం అరెస్టు చేశామని సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి, మోబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం, గంజాయి సేవనానికి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి శివారులో దాడి చేసి యువకులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. పోలీసులను గమనించి వారు పరార్ అయ్యేందుకు ప్రయత్నించగా సీఐతోపాటు ఎస్‌ఐలు లక్ష్మణరావు, సతీష్, సిబ్బంది వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని మామిడి మనోజ్(18), అరిగా మహేష్(19), పేర్ని విజయకుమార్(18), మలిజేటి మధు (20)గా గుర్తించారు. రెండు రోజుల క్రితం పాడేరు ప్రాంతానికి వెళ్లిన సమయంలో దారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.500కు 50 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్టు విచారణ సమయంలో వారు తెలిపారు. వారి నుంచి 30 గ్రాముల గంజాయి, గంజాయి సేవనానికి వినియోగించే వస్తువులు, మొబైల్ ఫోన్, గంజాయి కొనుగోలు, రవాణాకు వినియోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఎన్‌డీపీఎస్ చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నట్టు సీఐ తెలిపారు.


