నక్కపల్లి : ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న చందంగా తయారయింది పునరావాసకాలనీకి తరలిపోయిన పింఛనుదారుల పరిస్థితి. ప్రతి నెలా పింఛను తీసుకునేందుకు 10 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని మా వల్ల కావడం లేదంటూ పండుటాకులు గురువారం అధికారులకు మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కొరకు ప్రభుత్వం మండలంలో పాటిమీద, మూలపర, అమలాపురం, తమ్మయ్యపేట గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఖాళీ చేయించింది. వీరికి పెదబోదిగల్లం వద్ద పునరావాసం కల్పించి ఇళ్ల స్థలాలు కేటాయించడంతో వీరంతా సొంత ఊర్లను వదిలేసి పునరావాస కాలనికి వెళ్లిపోయారు. ఈ గ్రామాల పరిధిలో సుమారు 200 మందికి పైగా పింఛను తీసుకునే వృద్ధులు ఉన్నారు. వీరంతా ప్రతి నెలా ఒకటో తేదీన వారి వారి సొంత గ్రామాలకు వెళ్లి పింఛను తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో మంచాన పడ్డవారు, వివిధ కారణాల వల్ల నడవలేని స్థితిలో ఉన్నవారు పింఛను తీసుకునేందుకు అమలాపురం సచివాలయానికి వెళ్లాల్సి వస్తోందని, ఇలా వెళ్లడానికి అనేక వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తోందని పునరావాసకాలనీ వద్దకు తెచ్చి పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ అమలాపురానికి చెందిన వృద్ధులు, వితంతువులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందు ఆధ్వర్యంలో అధికారులను కలసి వినతి పత్రం అందజేశారు.


