నా భర్త చనిపోయి రెండేళ్లు అవుతుంది. వయస్సు కూడా 50 ఏళ్లు దాటింది. సీఎం చంద్రబాబు వితంతువు లేదా వృద్ధాప్య పింఛన్ ఇస్తారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇటీవల సచివాలయంలో దరఖాస్తు తీసుకున్నప్పటికి పలు కారణాలు చూపారు. కొత్త పింఛన్ పొందడం అనుమానంగానే ఉంది. మాలాంటి పేదలను ఆదుకోరు గానీ పథకాల ప్రచారానికి నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఇదేం న్యాయం.?
– జె.కాసులమ్మ, వితంతువు, గెడ్డంపుట్టు, పాడేరు మండలం
ప్రచారానికి నిధులా.. ఇదెక్కడి విడ్డూరం?
ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 సాయం అందిస్తానని అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు టీవీల్లో విన్నాను. ఇంత వరకు ఇవ్వలేదు. ముగ్గురు పిల్లలతో జీవనోపాధికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నెలకు రూ.1500 సాయం అందితే కొంత వరకు మేలు జరుగుతుంది. పథకాల అమలు చేయరు గానీ ప్రచారానికి డబ్బులు ఖర్చు చేస్తున్నారని మా గ్రామంలో అందరూ చెప్పుకోవడం విన్నాను. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు.
– కిల్లో అనూష, తుంపాడ గ్రామం, పాడేరు మండలం


