శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు మింగిస్తున్న కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: బాలబాలికలకు నులిపురుగుల నివారణ మందులు వేయడం ద్వారా వారు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. పాడేరులోని శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు కలెక్టర్ ఆల్బెండజోల్ మాత్రలను స్వయంగా మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా మాత్రలు పంపిణీ చేయడంతో పాటు వైద్య బృందాలు పర్యవేక్షణలో విద్యార్థులు మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ కారణంతోనైనా మాత్రలు వేసుకోలేని వారికి వచ్చేనెల 5న పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్‌బైగ్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ బాలమురళీకృష్ణ, జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, తహసీల్దార్ శ్రీనివాసరావు, వైద్యాధికారి సాయిశ్రీ, పాఠశాల హెచ్‌ఎం మంజుల పాల్గొన్నారు.


