యలమంచిలి రూరల్: పట్టణంలోని ఉలక్‌పేటకు చెందిన మళ్ల నూకరాజు(51) మృతదేహాన్ని దిమిలిరోడ్డులో రహదారి పక్కన మురుగు కాల్వలో గుర్తించినట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు.ఈ నెల 24వ తేదీ రాత్రి భూలోకమాంబ ఆలయం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నూకరాజు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో కర్రి ఆదిలక్ష్మి అనే మహిళ ద్వారా దిమిలిరోడ్డు కరణం అప్పారావు అపార్టుమెంటు వద్ద పడిఉన్నట్టు తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూశారు. అప్పటికే నూకరాజు మృతి చెందాడు. మృతుడి నుదుటి భాగంలో ఎడమ కన్నుపైన, కుడివైపు దవడపై గాయాలున్నట్టు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మృతుడి కుమారుడు మళ్ల హరి పేర్కొన్నాడు. తమ తండ్రికి నరాల బలహీనత ఉందని, నెమ్మదిగా నడుస్తాడని తెలిపాడు. ప్రమాదవశాత్తు మురుగుకాల్వలో పడి గాని, విద్యుదాఘాతంతో గాని మృతి చెంది ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.


