తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుకు నీరందే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మాడుగుల: కేచ్‌మెంట్ ఏరియాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పెద్దేరు జలాశయం జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 134 మీటర్లకు చేరుకుంది. దీంతో ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు నీటికి ఢోకా ఉండదని రైతులు తెలిపారు. మండలంలో ఇంత వరకు ఎండిపోయిన పెద్దేరు, గొరిగెడ్డల్లో వచ్చి చేరుతోంది. ఈ ఏడాది తొలిసారిగా గెడ్డల్లోకి వరద నీరు చేరడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోనాం..
చీడికాడ: తుపాను కారణంగా మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం నాలుగు రోజుల్లో నాలుగు మీటర్లు పెరిగింది. ఈ నెల 21వ తేదీన 91 మీటర్లు పడిపోయిన నీటిమట్టం గడిచిన నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా నాలుగు మీటర్లు పెరిగి శుక్రవారం సాయంత్రానికి 95 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,000 క్యూసెక్కులకు చేరిన ఇన్‌ఫ్లో శుక్రవారం సాయంత్రానికి 600 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా ప్రస్తుతం 95 మీటర్లు ఉంది.
తాండవ..
నాతవరం: తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోందని తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, డీఈ అనురాధ తెలిపారు. తాండవలో నీటిమట్టాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ... తుపానుకు ముందు ప్రాజెక్టులో నీటిమట్టం 361.3 అడుగులు ఉండేదని, ప్రస్తుతం 367.7 అడుగులకు చేరిందని తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి రోజుకు 3,000 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోందని చెప్పారు. ప్రాజెక్టులో మరింత నీటిమట్టం పెరిగితే ఖరీఫ్‌కు నీరు సరఫరా చేస్తామన్నారు. వీరి వెంట తాండవ ప్రాజెక్టు జేఈ దుర్గబాబు తదితరులు ఉన్నారు.
105 మీటర్లకు చేరిన రైవాడ నీటిమట్టం
దేవరాపల్లి: ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తాజా శుక్రవారం మరో మీటరు మేర నీటిమట్టం పెరిగింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 105 మీటర్లకు చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలోని రెండు మీటర్లు నీటిమట్టం పెరగడం పట్ల ఆయుకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది ఖరీఫ్‌కు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


