కశింకోట: మండలంలోని కన్నూరుపాలెం (ఈశ్వరపల్లి చౌడువాడ) గ్రామంలో రెండేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు యువకులకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను విధిస్తూ అనకాపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎ.రమేష్ శనివారం తీర్పు చెప్పారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం..
కన్నూరుపాలెం గ్రామంలో 2024 జూన్ 13న అదే గ్రామానికి చెందిన బొడ్డు కాశీ బద్రి విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు. ఈ విషయాన్ని గమనించి అదే రోజు రాత్రి సకిలేటి సాయి, దల్లి కామిరెడ్డి, వళ్లు శ్రీను ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువా, ఇనుప సేఫ్‌ను తెరచి వాటిలో ఉన్న సుమారు రూ. 1.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో అరెస్టు అయిన నిందితులను విచారించగా, వారు కన్నూరుపాలెంలో జరిగిన చోరీ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చోరీ చేసిన నగదును పంచుకొని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు దర్యాప్తు, న్యాయపరమైన చర్యలు అనంతరం అభియోగాలు రుజువు కావడంతో నిందితులకు మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ కె.లక్ష్మణరావు సమర్థంగా దర్యాప్తు నిర్వహించి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసి శిక్ష పడేలా చేశారు. ఇందుకు ఆయనతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.వాణిలను ఎస్పీ తుహీన్ సిన్హా అభినందించారు.


