సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

● అర్హులకు అందని వంట గ్యాస్‌ ● వాణిజ్య అవసరాలకు మళ్లుతున్న సిలిండర్లు ● వ్యాపారులకు రెట్టింపు ధరకు విక్రయం ● అనధికారంగా గ్యాస్‌ నిల్వలు

అచ్యుతాపురం రూరల్‌: గృహావసరాలకు ఉపయోగించే వంటగ్యాస్‌ పక్కదారి పడుతోంది. ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో కొంతమంది వ్యాపారులు చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది వరలో పౌరసరఫరాల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 82 సిలిండర్లు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో సెజ్‌ కార్మికులు, వలస కార్మికులను ఆసరాగా చేసుకుని నిత్యావసరమైన వంట గ్యాస్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు. సాధారణ సిలిండర్లు బుక్‌ చేసుకున్న వారికి ఓటీపీ చెప్పాల్సిందేనని నిబంధనలు చెబుతున్న డీలర్లు.. అక్రమ రీఫిల్లింగ్‌ చేసుకునే వారికి మాత్రం రోజుకు పెద్ద మొత్తంలో సిలిండర్లు సరఫరా చేయడం ప్రశ్నార్థకంగా మారింది.

గృహావసరాలకు అందని సిలిండర్లు

పారిశ్రామిక ప్రాంతం పరిసరాల్లో వంట గ్యాస్‌ సరఫరా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గృహావసరాల కోసం గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నప్పటికీ సకాలంలో అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక ప్రాంతంలో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలకు గృహ వినియోగ సిలిండర్లు అధిక ధరలకు చేరుతున్నాయి. గృహావసరాలకు కేటాయించిన సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లుతున్నాయి. గ్యాస్‌ బుక్‌ చేసుకున్నవారికి నెల, రెండు నెలలు కూడా ఆలస్యం అవుతుంది. అదే వ్యాపారులకు మాత్రం క్షణాల్లో అందుబాటులోకి ఉంటున్నాయి.

గ్యాస్‌ బుక్‌ చేసినా బొగ్గుల పొయ్యే దిక్కు

ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్లు అయిపోయిన వెంటనే వినియోగదారులు సిలిండర్‌ కోసం బుకింగ్‌ చేసుకుంటున్నారు. అయితే బుకింగ్‌ చేసిన తర్వాత సిలిండర్‌ సకాలంలో అందక గృహిణులు కట్టెల పొయ్యి లేదా బొగ్గు పొయ్యి మీదో వంట చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉరుకులు పరుగులు తీస్తూ జీవనం సాగించే ప్రస్తుత ప్రపంచంలో, బొగ్గుల పొయ్యిలపై ఆలస్యంగా వంటలు చేసుకుని దినసరి కూలి పనులు చేసుకోవడానికి వెళ్లేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వ్యాపారులకు మాత్రం కొరత లేదు

ఇళ్లకు సరఫరా కావాల్సిన గ్యాస్‌ సిలిండర్లు కొందరు వ్యాపారులకు ఎలా అందుతున్నాయనే ప్రశ్నలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు ఇతరులకు విక్రయించడంలో గ్యాస్‌ ఏజెన్సీలు తమదైన చేతివాటం చూపుతున్నాయి. ఒక్కో సిలిండర్‌ రూ.2 వేలు పైబడి అక్రమంగా అమ్ముకుంటూ కుబేరులవుతున్నారని, గ్యాస్‌ అమ్మకాలు చేసే వారు రోజుకు వేళల్లో అక్రమంగా సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

ఎక్కడిపడితే అక్కడ అనధికారంగా గ్యాస్‌ నిల్వలు

కొన్ని ప్రాంతాల్లో భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా గ్యాస్‌ సిలిండర్లను నిల్వ ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జనావాసాల మధ్య, దుకాణాల వద్ద అనధికారంగా సిలిండర్లు నిలువలు ఉంటున్నాయని స్థానికులంటున్నారు. ఇలాంటి నిల్వల వల్ల ప్రమాదం సంభవిస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అధికారులు దృష్టి సారించాలి

అనధికార నిల్వలు, అధిక ధరలకు నిక్రయాలు, గృహ వినియోగ సిలిండర్ల దుర్వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద బుకింగ్‌ నుంచి డెలివరీ వరకూ ప్రక్రియను పరిశీలించి, సిలిండర్లను సకాలంలో వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమంగా నిల్వలు ఉంచుతున్న వారిపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిలిండర్‌ కోసం సామాన్యుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా.. గ్యాస్‌ సరఫరాలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement