పాయకరావుపేట : శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ లెక్చరర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి జి.తాతయ్య నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డును అందుకున్నట్టు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్‌ప్రకాష్ తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాలేజీ కోదండరామయ్య బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డా.ఎం.సుధాకర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారన్నారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ రక్తదాన శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను చురుగ్గా భాగస్వాములను చేసినందుకు ఆయన సేవలకు ఈ అవార్డు లభించిందన్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.ఆర్.కె.రెడ్డితో పాటు అధ్యాపకులు అభినందించారు.


