సాక్షి, పాడేరు: జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పాడేరుతో పాటు మిగిలిన 10 మండలాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. పాడేరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ టి.నిశాంతి సందర్శించి లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.
● అన్ని కేంద్రాల్లో తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అధికంగా ఓట్లు పోలయ్యాయి. అనంతరం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు తొలగించి ఓట్ల లెక్కింపు చేపట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను వేర్వేరుగా కట్టలుగా విభజించి లెక్కించారు. పలు కేంద్రాల్లో లెక్కింపు నెమ్మదిగా సాగడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది.
● జిల్లాలోని 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రికి పూర్తవడంతో ఫలితాలు వెలువడ్డాయి. తొలుత ప్రకటించిన అనంతగిరి జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దూరు జయవర్ధిని విజయం సాధించారు. అనంతరం గూడెంకొత్తవీధిలో కంకిపాటి గిరిప్రసాద్, చింతపల్లిలో కోరాబు అనూషదేవి, పెదబయలులో వంతాల శాంతి, పాడేరులో సీదరి రాంబాబు, డుంబ్రిగుడలో హరి గెలుపొందారు. వీరంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే కావడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి.
● జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన ఆరు జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో పెదబయలు, డుంబ్రిగుడ, పాడేరు, జి.కే.వీధి, చింతపల్లి, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో అధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడంతో ఆయా మండలాల్లో ఎంపీపీ పీఠాలు కూడా ఆ పార్టీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హోరాహోరీ పోరు
అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు కై వసం
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందం
విజేతలను అభినందించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు


