● మారుమూల గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
● నీటమునిగిన పంట పొలాలు.. కూలిన ఇళ్లు
● పొంగిపొర్లిన గెడ్డలు, వాగులు, కాజ్‌వేలు
● మత్స్యగెడ్డ ఉగ్రరూపం.. స్తంభించిన జనజీవనం
వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీ
ప్రాంతం మొత్తం వరదలతో
అతలాకుతలమైంది. మత్స్యగెడ్డ
ఉగ్రరూపం దాల్చడంతో పాటు
వాగులు, గెడ్డలు పొంగిపొర్లి
వందలాది మారుమూల గ్రామాలకు
రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
పాడేరు, జి.మాడుగుల రహదారి
తెగిపోవడంతో జనజీవనం
స్తంభించింది. మూడు రోజులుగా
కురిసిన కుండపోత వర్షాలకు
కాజ్‌వేల పైనుంచి వరద నీరు
ముంచెత్తడంతో వాహనాల
రాకపోకలు నిలిచిపోయాయి. పలు
చోట్ల పంట పొలాలు ముంపునకు
గురయ్యాయి. మట్టి ఇళ్లు నాని
కూలిపోయాయి.
మత్స్యగుండం బండరాళ్ల మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
ముంచెత్తిన వరద
గిన్నెలకోట నుంచి ఇనుపతీగల గ్రామం వరకు మట్టి రోడ్డుపై గెడ్డను తలపిస్తూ ప్రవహిస్తున్న వరద నీరు
వాయుగుండం ప్రభావంతో
మన్యంలో కుండపోత వర్షాలు
సాక్షి, పాడేరు: వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీ వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కొండవాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, జి.కె.వీధి, ముంచంగిపుట్టు, హుకుంపేట, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని గెడ్డలు, కొండవాగులు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మత్స్యగెడ్డ ఉధృతి కారణంగా కుంబిడిసింగి, పరదానిపుట్టు కాజ్‌వేలపై నీరు పొంగి ప్రవహిస్తూ మూడు రోజులుగా సుమారు 150 గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండలంలోని రాళ్లగెడ్డ కూడా కాజ్‌వేపై నుంచి ప్రవహిస్తోంది. మత్స్యగుండం పుణ్యక్షేత్రం బండరాళ్ల వద్ద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో దర్శనాలను పూర్తిగా నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
జి.మాడుగులకు రాకపోకలు బంద్
పాడేరు నుంచి జి.మాడుగుల వైపు వెళ్లే జాతీయ రహదారిలో తాత్కాలిక పైప్ కల్వర్టుపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. అనంతరం కల్వర్టు కొట్టుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతా లతో సంబంధాలు తెగిపోయాయి. కొయ్యూరు చింతాలమ్మ ఘాట్‌లో కొండచరియలు విరిగిపడడంతో భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పాడేరు ఘాట్‌లో మరోచోట పడిన చరియలను ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించారు.
పంట భూములు మునక
జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు మండలాల్లో లోతట్టు వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. సంగం, నుర్మతికొత్తూరు గ్రామాల వద్ద వరి పంట పొలాలు చెరువుల్లా మారాయి. గబ్బంగి, గుత్తులపుట్టు, కొంతిలి, మఠం, రంగశీల పంచాయతీల్లోనూ పంట నష్టం చోటుచేసుకుంది. పలుచోట్ల గిరిజనుల మట్టి గోడల ఇళ్లు కూలిపోయాయి.
జలపాతాల వద్ద ప్రమాద హెచ్చరికలు
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన జలపాతాలన్నింటిలోనూ వరద ఉధృతి అధికంగా ఉంది. కొత్తపల్లి, చాపరాయి, రణజిల్లెడ, కటిక, పెద్దబయలు జలపాతాల్లో నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.
చింతాలమ్మ ఘాట్‌లో విరిగిన కొండ చరియలు
కొయ్యూరు: చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఐదు మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. చరియలు విరిగిపడే ముందు అనుమానంతో ఓ కారు పక్కకు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి అధికారులు నిర్మించిన రక్షణ గోడ కూడా ఈ చరియలను అడ్డుకోలేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిషోర్‌వర్మ ఘటన స్థలానికి చేరుకుని పొక్లెయిన్ సహాయంతో మట్టి పెళ్లలను తొలగించి రాకపోకలను కొంత వరకు పునరుద్ధరించారు. యూచీడిపాలెం పంచాయతీ బంగరుబండకు చెందిన పాంగి చంపకు గురువారం తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. సింగవరం కాలువ ఉధృతంగా ప్రవహించడంతో తాడుసాయంతో ఆమెను కాలువ దాటించి అనంతరం వాహనంలో వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. ఎం.బీమవరం వాలుగూడెంలో ఇళ్లలోకి వరదనీరు చేరగా, మారేడుమిల్లి–గుర్తేడు మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు, కాకరపాడు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాండవ జలాశయానికి నీరు అందించే తీగలమెట్ట కాలువ కూడా ఉప్పొంగుతోంది.
22 మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రాక
గూడెంకొత్తవీధి: భారీ వర్షాల ప్రభావంతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(ఎస్‌డీఆర్‌ఎఫ్) 22 మంది సభ్యులతో కూడిన బృందం గురువారం గూడెం చేరుకుంది. వారిలో 11 మందిని తోకరాయి గ్రామంలో ప్రమాదకరంగా మారిన కాలువ వద్ద సహాయక చర్యలకు నియమించగా, మిగిలిన 11 మందిని గంగవరం–డీ.ఆగ్రహారం గ్రామాల మధ్య వంతెన వద్ద మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తహసీల్దార్ అన్నాజీరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వంతెనలు దెబ్బతినడంతో పాటు అనేక ఇళ్లు కూలిపోయాయి. పలు రహదారులపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పనసపల్లి నుంచి పెబ్బంపల్లి, బంధవీధి, తడపల్లి, ధారకొండ ప్రాంతాల మీదుగా గూడెం పంచాయతీలోని బొడ్డుమానుపాకల–చుక్కగొయ్యి మార్గాల్లో కల్వర్టులు మునిగిపోయాయి. జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చెట్లు కూలిపోగా, గూడెం పాతవీధిలో కూడా చెట్లు పడిపోయాయి.
గూడెం పంచాయతీలో కొట్టుకుపోయిన కల్వర్టు
పాడేరు మండలం దేవరాపల్లి ప్రాంతంలో వరిపంట భూముల మీదుగా వరదనీరు
పెదబయలు: గిన్నెలకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇనుపతీగల గ్రామానికి వెళ్లే మట్టి రహదారి వర్షాల కారణంగా గెడ్డను తలపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డంతా నీటితో నిండిపోయింది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వరదనీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి వెళ్లే రెండు కిలోమీటర్ల ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో సుమారు 55 కుటుంబాలు, 280 మంది నివసిస్తున్నారు. సరైన రహదారి లేక నిత్యం అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి తారురోడ్డు మంజూరు చేయాలని, రోడ్డుపై వరదనీరు నిల్వ కాకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు చిక్కుడు సూరయ్య, గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డొంకరాయి డ్యాం గేట్లు ఎత్తివేత
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి మెయిన్ డ్యామ్ నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆరో నెంబర్ గేటును రెండు అడుగులు ఎత్తి 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఏవీపీ డ్యామ్ నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె.వి.రాజారావు డొంకరాయి డ్యామ్‌ను సందర్శించి నీటి మట్టాలను పరిశీలించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఏఈ శివశంకర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతున్న నేపథ్యంలో సీలేరు కాంప్లెక్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


