పాడేరు: మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ ఈ.కొత్తూరు మత్స్యగెడ్డ వద్ద నిర్మించిన భారీ వంతెన ప్రారంభించిన మూడు నెలలకే అప్రోచ్ రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బుధవారం సాయంత్రం వంతెన ఒక వైపు అప్రోచ్ రోడ్డు పూర్తిగా కూలిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేయడం, అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడం వల్లే వంతెన అప్రోచ్ రోడ్డు ఈ స్థితికి చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వరదల సమయంలో ఒక వ్యక్తిని తానే స్వయంగా గెడ్డలోకి దిగి రక్షించానని గుర్తుచేశారు. ఆ ఘటన తర్వాత తన విజ్ఞప్తి మేరకు భారీ వంతెన మంజూరై నిర్మాణం చేపట్టినప్పటికీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. వర్షాలు మొదలైన తొలి రోజుకే రోడ్డు కూలిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వంతెనకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.


