భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

● సహాయక, పునరుద్ధరణ చర్యలు ముమ్మరం ● కలెక్టర్‌ నిశాంతి

పాడేరు: వాయుగుండం కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్‌ టి.నిశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా వర్షపాతం, తుపాను పరిస్థితులు, రహదారులు, వంతెనలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు సహా క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది, వాహనాలు, యంత్రాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు తదితర మార్గాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తూ, మట్టిపెళ్లలు, చెట్లు వంటి అవరోధాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నాటికి అందిన సమాచారం మేరకు నష్టాలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, పూర్తి స్థాయి పరిశీలన అనంతరం గణాంకాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేసి అత్యవసర సేవలకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, వరదల అనంతరం వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అన్ని శాఖలు 24 గంటలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప, ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement