ప్రమాదస్థాయికి జలాశయాలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదస్థాయికి జలాశయాలు

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

సీలేరు: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని జలాశయాలు నిండుకుండలా మారాయి. సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని జోలాపూట్‌, బలిమెల, గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు భారీగా ఇన్‌ఫ్లోలు చేరుతుండటంతో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి నిర్వహణలో ఉన్న జోలాపూట్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 2,740 అడుగులకు చేరుకుంది. బలిమెల జలాశయం పూర్తిస్థాయి స్థాయికి చేరువలో ఉండగా, గత నాలుగు రోజులుగా రోజుకు 2–3 అడుగుల చొప్పున నీటిమట్టం పెరుగుతూ ప్రస్తుతం 1,590 అడుగులకు చేరుకుంది. గుంటవాడ, డొంకరాయి జలాశయాలు ఇప్పటికే ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. గుంటవాడ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి స్థాయి 1,360 అడుగులు కాగా, సాయంత్రం 6 గంటలకు 1,056 అడుగులకు చేరి వేగంగా పెరుగుతోంది. పిల్లిగడ్డ వాగు నుంచి భారీగా ఇన్‌ఫ్లోలు రావడం వల్ల నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి 1,037 అడుగులకు ప్రస్తుతం 1,031.40 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లోలు ఇదే విధంగా కొనసాగితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసి, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement