పాడేరు: జిల్లాలోని ప్రతి కుటుంబానికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ‘ప్రధానమంత్రి సేవా సంకల్ప అభియాన్’ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి స్పష్టం చేశారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రజలు నూనె, పంచదార, ఉప్పు వినియోగాన్ని తగ్గించుకుని క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జనఔషధి మెడికల్ స్టోర్ అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు నాణ్యమైన మందులను ఇక్కడ తక్కువ ధరలకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ సమయంలో వైద్య సేవల కోసం వచ్చిన రోగులు, సందర్శకులను నేరుగా కలిసి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ మురళీకృష్ణ, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


